.

Monday 17 December 2012

yeto vellipoyindi manasu review

రివ్యూ: ఎటో వెళ్లిపోయింది మనసు
రేటింగ్: 3.25/5
బ్యానర్: తేజ సినిమాస్
తారాగణం: నాని, సమంత, కృష్ణూడు, రవి రాఘవేంద్ర, వివేక్ పాఠక్ తదితరులు
కథ: రేష్మ
కథనం: గౌతమ్ మీనన్, రేష్మ
సంగీతం: ఇళయరాజా
కూర్పు: ఆంటోనీ
ఛాయాగ్రహణం: ప్రభు
నిర్మాత: సి. కళ్యాణ్
దర్శకత్వం: గౌతమ్ మీనన్
విడుదల తేదీ: డిసెంబర్ 14, 2012
గౌతమ్ మీనన్ సినిమాలంటే చక్కని పోయెట్రీ తెరంతా పరుచుకున్నట్టు ఉంటుంది. ప్రేమకథలు తీయడంలో అతను మాస్టర్. ప్రేమికుల ఫీలింగ్స్‌ని, ప్రేమతత్వాన్ని కాచి వడపోసిన దర్శకుడతను. ప్రేమ లోతుల్ని కొలిచేశాడు. అందుకే ప్రేమకి నిర్వచనమివ్వడమే చేతకాని వారి మధ్య అదేంటో కళ్లకి కట్టినట్టు చూపించేస్తాడు. రొమాంటిక్ డ్రామాల పండిట్ అయిన గౌతమ్ మీనన్ తీసిన మరో ప్రేమకావ్యం ‘ఎటో వెళ్లిపోయింది మనసు’.
కథేంటి?
వరుణ్ కృష్ణ (నాని), నిత్య యలవర్తి (సమంత) ప్రేమలో పడతారు. స్కూల్లోనే ప్రేమ చిగురించగా, కాలేజ్‌కి వెళ్లేసరికి అది బలపడుతుంది. ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో కూరుకుపోతారు. కానీ బాధ్యతలు తీసుకోవాల్సిన సమయం వస్తుంది. వరుణ్ తన ప్రేమకంటే ముందుగా కొడుగ్గా తన బాధ్యత నిర్వర్తించాలని అంటాడు. నేనూ వస్తానని నిత్య అంటుంది. మన జీవితం మొదలు పెట్టే ముందు ఎవరి జీవితం ఏమిటో తెలుసుకుని ఆ దిశగా అడుగేయడం ముఖ్యమంటాడు. అలా ఇద్దరూ విడిపోతారు. మళ్లీ కలుస్తారా లేదా? ఎలా, ఎపడు?
కళాకారుల పనితీరు!
నాని ఇంతవరకు కాస్త యాక్టివ్‌గా ఉండే పాత్రలే చేశాడు కానీ కామ్ గోయింగ్ పర్సన్‌గా, సాఫ్ట్ నేచర్‌తో ఉండే క్యారెక్టర్స్ చేయలేదు. అతడిలో ఈ కోణాన్ని గౌతమ్ మీనన్ చూపించాడు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా కానీ దానికి పూర్తి న్యాయం చేయగలనని నాని నిరూపించాడు. ఒక్కటే కంప్లయింట్ ఏమిటంటే స్కూల్ ఏజ్ పిల్లాడిలా కనిపించాల్సి వచ్చినపడు అందుకు అనుగుణంగా కాస్త శారీరిక మార్పుల కోసం ప్రయత్నించి ఉండాల్సింది. తమిళ హీరోల్లో ఆ లక్షణాలు ఎక్కువ. నానిని చివర్లో హీరోగా ఎంచుకున్నారు కాబట్టి ప్రిపరేషన్‌కి టైమ్ దొరికి ఉండకపోవచ్చు. అదలా ఉంచితే నటుడిగా నానికి వంక పెట్టలేం. అన్ని ఎవెూషన్స్ చక్కగా పలికించగలడు. మంచి దర్శకుల చేతిలో మరింతగా రాటుతేలుతున్నాడు.
సమంత పర్‌ఫార్మెన్స్ షాక్‌కి గురి చేస్తుంది. సమంతని ఓ అందమైన అమ్మాయిగా ‘ఏమాయ చేసావె’లో చూపించిన గౌతమ్ మీనన్ ఈ సినిమాలో ఆమెలో ఎంత గొప్ప నటి దాగి ఉందనే సంగతి స్పష్టం చేశాడు. కొన్ని సందర్భాల్లో ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే ‘వావ్’ అనిపించక మానదు. తెరపై ఓ నటి కాకుండా నిజంగా ఆ బాధని, ప్రేమ భావాన్ని అనుభవిస్తోన్న మనిషి తాలూకు రియల్ ఫీలింగ్స్ కనిపిస్తాయి. ఇంత మంచి నటిని కేవలం గ్లామర్ కోసం వాడుకోకుండా నటనకి అవకాశమిచ్చి, దాని మీద ఫోకస్ పెడితే ఎంతో బాగుంటుంది. ఎక్స్‌ట్రీమ్ క్లోజప్ షాట్స్ ఎన్నో ఉన్నాయి. వాటిలో ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ మరింతగా ఎలివేట్ అయ్యాయి. అవార్డ్ విన్నింగ్ పర్‌ఫార్మెన్స్ ఇది.
హీరో హీరోయిన్లు కాకుండా మిగతా ఎవరికీ ఎక్కువ స్క్రీన్ టైమ్ లేదు. తన ఆకారంతో కృష్ణూడు స్క్రీన్ స్పేస్ అయితే బానే కవర్ చేశాడనుకోండి.
సాంకేతిక వర్గం పనితీరు:
ఇళయరాజాని సంగీత దర్శకుడిగా ఎంచుకోవడానికో కారణం ఉండి ఉండాలి. ఇది నేటి తరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు సంగీతం అందించాల్సిన సినిమా అయితే కాదు. చిన్నతనం నుంచి మొదలై.. అంటే దాదాపు ఓ పదిహేడేళ్ల క్రితం మొదలై, అక్కడ్నుంచి నెమ్మదిగా ఇప్పటి ఏజ్‌కి పెరిగే స్టోరీ. కాబట్టి సంగీతం కూడా అలా కాలానుగుణంగా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఇళయరాజా కంటే బెస్ట్ ఛాయిస్ లేదు. ఆయన స్వరపరిచిన పాటలు బాగున్నాయి. నేపథ్యంలో వినిపించే కొన్ని పాటలు మాత్రం మరింత బాగుండాల్సిందనిపిస్తుంది. పాటల్తోనే చాలా వరకు కథ చెప్పడానికి దర్శకుడు ప్రయత్నించాడు. సాహిత్యం చక్కగా కుదిరింది.
గౌతమ్ మీనన్ సినిమాల్లో సంభాషణలది కూడా ప్రత్యేక శైలి. సహజమైన సంభాషణలకి పెద్ద పీట వేస్తాడు. కృత్రిమత్వానికి చోటుండదు. ఇది కూడా అంతే. సరిగ్గా ఎటెన్షన్ పే చేస్తే సంభాషణలు బాగా ఆకట్టుకుంటాయి. నిజంగా ఇలాగే మాట్లాడుకుంటాం కదా అనిపిస్తుంది. కాస్త ఆ గ్రాంథిక ధోరణి తప్పిస్తే మిగతా అంతా బాగుంది. ఛాయాగ్రహణ పరంగా కొన్ని బలహీనతలు కనిపించాయి. గౌతమ్ మీనన్ సినిమాల్లో ఇది అరుదుగా జరుగుతుంది. ఇంటర్వెల్ సీన్, ప్రీ క్లయిమాక్స్ సీన్ రెండూ హీరో ఇంటి టెర్రస్‌పై జరుగుతాయి. కీలకమైన ఈ సన్నివేశాలకి ఎంచుకున్న కెమెరా యాంగిల్స్ విస్మయ పరుస్తాయి. అక్కడ సినిమాటోగ్రఫీపై శ్రద్ధ వహించి ఉండాల్సింది. ద్విభాషా చిత్రమనే హడావుడిలో చేసిన పొరపాటో లేక వెరైటీ అనుకున్నారో కానీ అదైతే బాలేదు. ఎడిటింగ్ కూడా స్మూత్‌గా లేదు. వివిధ వయసుల్లో ఓ ప్రేమ జంట తాలూకు ఫీలింగ్స్, ఎవెూషన్స్‌తో కూడిన సినిమా కనుక నెరేటివ్‌లో స్మూత్‌నెస్ ముఖ్యం. కానీ అబ్ప్ట్ జంప్స్ ఉన్నాయనిపించింది.
గౌతమ్ మీనన్‌కి ఈతరం ప్రేమ భావాలు బాగా తెలుసు. ప్రేమికులకి సహజంగా ఎదురయ్యే ఈగో ప్రాబ్లెమ్స్, కెరీర్ సంబంధిత సమస్యలు, వాటి ప్రభావం అన్నీ అతను బాగా స్టడీ చేశాడు. ఈ చిత్రంలో అది బాగా కనిపిస్తుంది. స్కూల్ ఏజ్ లవ్, టీనేజ్ లవ్ పక్కనపెడితే ద్వితీయార్థంలో ఇద్దరు మెచ్యూర్డ్ పర్సన్స్ మధ్య వచ్చిన ఈగో క్లాష్‌ని చక్కగా తెరెకక్కించాడు. వారి ప్రేమకి దాటలేని అవరోధం ఏర్పడినపుడు ఎవెూషనల్‌గా లాక్ అయిపోయిన వారి భావాల్ని చిత్రీకరించిన తీరుకి హేట్సాఫ్ చెప్పాల్సిందే. ఆయన సినిమాలు స్లోగా ఉంటాయనే విమర్శ ఉంది. కానీ ఆయన శైలి అలాగే ఉంటుందనేది గమనించాలి. గోదావరిలో పడవ ప్రయాణంలో నిదానంగా, హాయిగా.. హత్తుకునేలా! ఇది స్పీడుగా లేదని కంప్లయింట్ చేయడం వెర్రితనమే అవుతుంది. దాంట్లోని ప్రశాంతతని, అనుభూతిని అనుభవిస్తేనే ఆ మాధుర్యం, అతని సినిమాల్లోని సౌందర్యం ఏమిటనేది తెలుస్తుంది.
హైలైట్స్:
మ్యూజిక్
నాని, సమంత పర్‌ఫార్మెన్స్
సెకండ్ హాఫ్
డ్రాబ్యాక్స్:
సినిమాటోగ్రఫీ
విశ్లేషణ:
గౌతమ్ మీనన్ సినిమాల్లో ఉండే సిగ్నేచర్ స్టయిల్ మిస్ కాని మూవీ ఇది. అణువణువునా దర్శకుడు కనిపిస్తాడు. ప్రేమ గ్రంథాన్ని పుక్కిట పట్టిన మేథావి ఆ భావనలోని చాలా విశేషాల్ని నిశితంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. కాస్త నిదానంగా కథ మొదలవుతుంది. టీనేజ్‌లో లవ్‌లో పడిన ఓ ప్రేమ జంట పెద్దయ్యే వరకు దానిని నిలుపుకుని పెళ్లి వరకు వెళ్లాలంటే మధ్యలో ఎన్ని దాటుకుని వెళ్లాలో, ఎన్ని తట్టుకుని నిలబడాలో గౌతమ్ మీనన్ క్లియర్‌గా చూపిస్తాడు.
స్కూల్ ఏజ్‌లో అమ్మాయి టూమచ్‌గా స్టడీస్‌పై, ఇతర యాక్టివిటీస్‌పై కాన్సన్‌ట్రేట్ చేయడం, అబ్బాయి ఏవెూ నిరంతరం ఆమె ఎటెన్షన్ కోరుకోవడం... కాస్త వయసు పెరిగాక అమ్మాయికి అబ్బాయే లోకం కావడం.. అబ్బాయికేవెూ కెరీర్ పరమైన టెన్షన్ ఏర్పడడం.. మనకి తెలిసిన విషయాలే. వాటిని దర్శకుడు ఎంత బాగా చూపించాడనేది చూస్తే మాత్రం మెచ్చుకోకుండా ఉండలేం. ఆ తర్వాత మరింత వయసు పెరిగి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత వయసుతో పాటు పెరిగిన ఈగో గోడని బద్దలు కొట్టడం ఎంత కష్టవెూ, అది దాటుకుని ఒక్కటవడం ఇంకెంత ఇబ్బందికరవెూ.. ప్రతిదానినీ గౌతమ్ మీనన్ పూసగుచ్చినట్టు చూపించాడు.
ముఖ్యంగా ప్రేమికులకి ఈ సినిమాలో చూపించిన విషయాలు బాగా కనెక్ట్ అవుతాయి. ప్రేమని అనుభవించిన వాళ్లకీ, అనుభవిస్తున్న వాళ్లకీ తప్పకుండా మనసెటో వెళ్లిపోతుంది. సినిమాని కేవలం ఎంటర్‌టైన్‌మెంట్, టైమ్ పాస్ కోసమని చూసేవాళ్లు మాత్రం ఈ సినిమా ఎటూ కదలడం లేదనిపిస్తుంది. నిజమే.. ఈ చిత్రం ఎటూ కదలదు. ఏళ్లు గడుస్తున్నా కానీ ఇద్దరు ప్రేమికుల మధ్య వచ్చి పడే సమస్యలే దీనికి ఇతివృత్తం. అలాంటపడు కథ ఎపడూ ఒకే చోట పరిభ్రమిస్తూ ఉంటుంది. సమస్యకి పరిష్కారం చిన్న సారీనే. కానీ అది గొంతు దాటి బయటకి రావాలంటే టైమ్ పడుతుంది. ఈ సినిమాలో దర్శకుడు దానినే చూపించాడు. ఆ ఫీలింగ్స్ తెలిసిన వారికీ, అనుభవించిన వారికీ ఓ దృశ్యకావ్యం చూస్తున్న భావన కలుగుతుంటే, కేవలం దృశ్యం మాత్రం చూస్తూ, దానిలో ఇన్‌వాల్వ్ కాలేని వారికి మనసులు పడుతున్న సంఘర్షణ అంతులేని నసలా అనిపిస్తుంది. ఈ చిత్రంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంలో విచిత్రం లేదు. ఎందుకంటే కనెక్ట్ అయిన వారికి బాగా నచ్చేసే ఈ చిత్రం కనెక్ట్ కాలేని వారి నుంచి పూర్తిగా నెగెటివ్ కామెంట్స్ మాత్రమే ఎదుర్కొంటుంది.
పతాక సన్నివేశాల్లో హీరో హీరోయిన్లు ఇద్దరూ కలుసుకోవడం, తర్వాత ఆమె ఇంటికొచ్చి హీరో బరస్ట్ అవడం ఈ సినిమాకే హైలైట్స్. సూపర్బ్ లవ్ ఫీల్ తీసుకొచ్చిన దర్శకుడు ఓ ఫీల్ గుడ్ ఫిలిం చూసిన అనుభూతిని నింపి పంపిస్తాడు.
కమర్షియల్ సెక్సస్ విషయంలో కొన్ని సందేహాలున్నాయి. ఎందుకంటే పూర్తిగా ఒకే సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌కి అప్పీల్ అవుతుంది. మన సినిమాలకి రాజ పోషకులైన మాస్ ఆడియన్స్ ‘సుత్తి సినిమా’గా కొట్టి పారేస్తారు. కానీ ఇది బాగా నచ్చేసే జనం కూడా ఉంటారు. ‘కల్ట్ స్టేటస్’ దక్కించుకునే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. గౌతమ్ మీనన్‌లాంటి దర్శకుల నుంచి ఫెయిల్ అయిన మూవీస్ వస్తుంటాయి కానీ వాళ్లెపడూ ఫెయిల్ కారు. ఇలాంటి దర్శకులు తపలు చేసినా వేలెత్తి చూపించడం కుదరదు. తలెత్తి తపలెంచాలి. ఎందుకంటే వాళ్లు తపలు చేసినా అంత ఎత్తులోనే ఉంటారు!!
ఈ సినిమా పరంగా కొన్ని తపలైతే దొర్లాయి కానీ ఓవరాల్‌గా మాత్రం దర్శకుడి పరిశీలనా శక్తికి, భావజాలానికీ ముగ్ధులు కాక తప్పదు. ప్రేమలో పడినప్పటి అనుభూతుల్ని నెమరు వేసుకోవడానికి పెద్ద వాళ్లు, ప్రేమ మైకంలో ఓలలాడుతున్న ఈతరం వాళ్లు అంతా తప్పక చూడాల్సిన చిత్రమిది. ప్రేమ గురించిన సినిమా. ప్రేమికుల కోసం తీసిన సినిమా. ఇది అందరి ప్రేమకథ అని గౌతమ్ మీనన్ ఊరికే చెప్పలేదు. దానికి అర్థం సినిమా చూస్తేనే తెలుస్తుంది.
బోటమ్ లైన్: ఎటో వెళ్లిపోతుంది మనసు!
విహారి

0 comments:

Post a Comment

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites